Monday, June 27, 2011

ప్రేమ - పెళ్ళి (నా కథ) - 6


  ప్రేమ - పెళ్ళి (నా కథ) -5 కి తరువాయి
          అప్పుడేమైంది..సూర్యుడు పశ్చిమాన ఉదయించలేదు..చుక్కలు రాలిపడలేదు..కాని..మా గురివిణి గారి గొంతు వినపడింది.."బాబూ నీళ్ళ తొట్టిలో పీకలదాక మునుగు" .దెబ్బకి నిద్ర వదిలిపోయింది ఏదో సహారా ఎడారిలో చేపలు పట్టమన్నంత సులువుగా చెప్పారు. కాని ఏమి చేస్తాం అంత తెల్లవారుఝామున నాకు సూర్యుణ్ణి చూడాలి అనే కోరిక లేదు,ఒక వేళ కోరిక పుట్టినా మా పాఠశాలలో చందాలు వసూలు చేసి నార్వే వెళతా కాని మండే సూర్యిణి-3 చూడాలి అనే సరదా లేదు.
          పరిస్తితి చూస్తే ముందు నుయ్యి..(నిజంగానే నీళ్ళ తొట్టె నుయ్యి లాగా ఉంది).సరే ఇప్పుడు మీరు సామెత పూర్తి చెయ్యండి. వెనక??? గొయ్యి అని మీరు సామెత పూర్తి చెయ్యొద్దు (అదే మరి మీరు గోతిలో పడ్డారు వెనక మా గురివిణి గారు ఉన్నారు) ఇంక చేసేదిలేక తొట్టిలో దిగా, అప్పుడు మా గురివిణి గారు చెప్పారు"ఇంత చలిలో నీటిలో మెడలోతు మునిగి సాధన చేస్తే సంగీతం బాగావస్తుంది" (నేను: వస్తుంది,వస్తుంది.. నా ప్రాణం కూడా పోతుంది ) అని అనుకొని మనసు,ఒళ్ళు కూడా రాయి చేసుకొని నీటిలో దిగా.
          వెంటనే అంటార్కటికాలో తేలా, మంచు మీద ఈదుతున్నట్టు , ఎస్కిమోలతో చేపలుపట్టినట్టూ ఏదేదోలా అనిపించడం మొదలుపెట్టింది. లోపు మా గురివిణి గారు పాఠం మొదలుపెట్టడంతో లోకం లోకి వచ్చా. అలా ప్రాణాలకు తెగించి మొదటి రోజు పాఠం ఎలాగో పూర్తి చేసా.
కానీ అప్పటికే అర్ధం అయిపోయింది.. తతంగం ఇలాగే జరిగితే ఏదో ఒక రోజు నేను అలా నీటిలోకి దిగి గడ్డ కట్టుకొని పోతా , తరువాత నన్ను మంచు శిల్పం లాగ ప్రతిష్టించి, చలిలో సంగీత సాధనను ఒక సాహసక్రీడలాగ ప్రకటించి నన్నే మస్కట్ లాగ చేసేస్తారు.
          ఆ రోజు సాయంత్రమే తరవాత రోజు నుండి ఎలాగైనా ఎగ్గొట్టాలి ఆలోచించి , మేడం గారూ, నాకు ఉదయం చలికి జ్వరం వచ్చిందండి, చలికి చణ్ణీళ్ళు పడటం లేదండి,కాబట్టి రేపటి నుండి రాలేనండి అని చెప్పా..ఆవిడ కూడా ఒప్పుకున్నారు. కాని అంతటితో ఆగితే విషయం ఏముంది. విధంగా మేడం గారి నుండి తప్పించుకొన్నాను అని గర్వంగా చెప్పుకొని మా స్నేహితులతో సంబరాలు చేసుకొనేందుకు మా తరగతిలోనే సాయంత్రం సమావేశం ఏర్పాటు చేశా...మా జనాలందరూ వచ్చారు.చుట్టూ బల్లలు వేసారు. వదిలింది మామా వదిలిందిరో..సంగీతం గోలా వదిలిందిరో అని చెమ్మచెక్కలాడుకొని, కేకులు,బజ్జీలు తిని,శీతల పానియాలు తాగి చల్లబడి(వాళ్ళందరూ వచ్చింది వీటికోసమే అని అర్ధమైతే మీ పేరును నోబెల్ కమిటీకి సిఫార్సు చేస్తా.. విభాగంలో అని అడగకండి నాకూ తెలియదు :) )..జయహో..జయహో అని పాడారు.కాని మనసులో ఏదో ఒక బాధ, ఇక నుండి నేను పికాసో వర్మ మాత్రమే కదా, అనుకొని గుండె రాయి చేసుకొని సరే లలాట లికితం అని నిర్ణయించుకొని, దానికే ఫిక్స్ అయ్యా. ఏదైతే అది అయ్యింది అని క్షణమే శాశ్వతం అనుకొని మా వాళ్ళకి చిద్విలాసంగా, ఇండియా కి ప్రపంచ కప్ సాధించిన ధోనీ విజయ గాధ పంచుకొంటే ఎలా ఉంటుందో..అంత ఆనందంగా నా విజయగాధ చెప్పడం మొదలుపెట్టా. కధ పూర్తయ్యింది, వెనక్కి తిరిగి చూస్తే, శ్రీకాంతి ,మణిమాల వికటాట్టహాసం చెస్తున్నారు.చచ్చా అనుకొన్నా...ఒక్కసారిగా ఎక్కడో హై వోల్టేజీకి బల్బు పగిలింది.
          తరువాత రోజు మాములుగా గడిచింది, తరువాత రోజు సంగీత తరగతి తరువాత మా గురివిణి గారు నన్ను పిలిచారు. ముందు వారం వర్ఝ్యం చూసుకొన్నా, తరువాత తిథి,రాహుకాలం ,యమగండం చూసుకొన్నా, తరువాత ఇవి ఏమి అర్ధం కావడం లేదు అని పక్కన పడేసి ధైర్యం గా ఆవిడ దగ్గరకు వెళ్ళా.
          ఆవిడ నన్ను చూస్తున్నారు,నేను పక్కకి చూస్తున్నా,ఆవిడ నన్ను చూస్తున్నారు, నేను తరగతిలో ఎన్ని సంగీత పరికరాలు ఉన్నాయో లెక్క పెట్టా, ఆవిడ నన్ను చూస్తున్నారు నేను ఆవిడ కూర్చున్న కుర్చీకి ఎన్ని కాళ్ళో లెక్కపెట్టా. ఆవిడ నన్నే చూస్తున్నారు..అఖరికి నోరు తెరిచి అడిగారు.
ఆమె:ఏమి జరిగింది
నేను
:ఏమి జరగలేదండి.దేన్ని జరిపేంత బలం కూడా నాకు లేదండి.
ఆమె
:అతి తెలివిగా సమధానం చెప్పాననుకొంటున్నావా?
నేను
:నాకు తెలివే లేదండి ఇంక అతి తెలివి ఎక్కడిది?
ఆమె
:తెలివి లేని వాళ్ళకే అతి తెలివి ఉంటుందిలే, నువ్వు చేసేవన్నీ నాకు తెలియవు అనుకొన్నావా, నీలాంటి వాళ్ళని వందల మందిని చూసా.చూస్తూ ఉండు నీకు సంగీతం ఎలా వంటబడుతుందో.
నేను:వంటబట్టడానికి ఇదేమైనా రోగానికి వేసే మందా..నేను ముందే నిర్ణయించుకొన్నా నా బిరుదు పికాసోవర్మ ,మీరు కాదు కదా సరస్వతీదేవే వచ్చినా నాకు సంగీతం నేర్పలేదు అని బయటకు నడిచా....వెనక నుండి "నీ ధైర్యాన్ని దర్శించి దైవాలు తలవంచగా" అని ఒక పాట వినిపిస్తుంది. నేను ధైర్యే సాహసే ఉపశమనం దగ్గు అనుకొని ముందుకెళ్ళా. కాని ఒక అజ్ఞాత శక్తిచే వెనక్కు లాగబడ్డా, విషయం అర్ధమయ్యింది కదా, మరు నిమిషం నాకు శిక్ష ఏమిటి అంటే నేను సాయంత్రం దాక గోడ కుర్చీ వేసి స్వరాలు చెప్పాలి.
దానికి తోడు మా ఖర్మకాలి తరువాత తరగతి మాస్టారు రాకపోవడంతో ఈవిడే తరగతి కూడా తీసుకొన్నారు.
రోజు జరిగిన అవమానానికి ఎలా పగ తీర్చుకోవాలా అని ఆలోచించా. పలు రకాల ఆలోచనలు వచ్చాయి.
1)(
ప్రణాళిక ) మా తరగతిలో  వీర శివా రెడ్డినాయుడికి చెప్పి రెండు బాంబులు తెప్పించి ఈవిడ ప్రాణం గా చూసుకొనే స్కూటీ మీద వెయ్యాలి.
2)(ప్రణాళిక బి) ఈవిడ హార్మొనియం పెట్టెని ఎలకల చేత కొట్టించాలి
3)(
ఫ్రణాలిక సి) మా పాఠశాల పక్కనున్న పట్నంలో ఒక ప్రముఖ హిప్నాటిస్టు చే ఈవిడ సంగీతం మర్చిపోయేలా చెయ్యాలి.
4)(
ప్రణాలిక డి) ఈవిడ ప్రాణంగా చూసుకొనే స్కూటీ సీటు చింపి టైరు కొయ్యాలి.
మొదటిది
బాగా హింసాత్మకంగా అనిపించింది, రెండోది ఎలక మచ్చిక చేసుకోవడం కష్టం అని ఆగిపోయా, మూడవది చాలా డబ్బుతో కూడినది (తాకట్టు పెట్టడానికి మా నాన్న/తాత గార్లు నాకు ఏమీ ఆస్తులు రాయలేదు)
కాబట్టి చివరగా చివరి ప్రణాళిక కి సరే అనుకొన్నా.
ఎప్పుడు
అమలు చేద్దామా అని అవకాశం కోసం ఎదురు చూసా. ఒక రోజు మా గురివిణి గారు వేరే తరగతి మధ్యలో వచ్చారు, నన్ను బర బరా ఈడ్చుకొని వెళ్ళారు.
ప్ర. గారి గదికి వెళ్ళాము, మా శ్రీకాంతి, మణిమాలలు అక్కడే ఉన్నారు వాళ్ళతో పాటు ఇద్దరు మా పై తరగతి వాళ్ళు.వీళ్ళెందుకు ఇక్కడ ఉన్నారు అనుకొంటుండగా మా ప్ర. గారు:విచారణ మొదలుపెట్టండి.
నాకేమి అర్ధం కాలా విచారణ దేనికి?
ప్ర
.: మేడం గారి స్కూటీ సీటు ,టైరూ కోసినట్టు ఒప్పుకొంటున్నవా
నే
: నాకు ఏమీ తెలియదు
నే
(మనసులో):అదేంటి నేనేమైనా దేవుడిని అయిపోయానా, నేను అనుకోగానే దానంతట అదే జరిగిపోయింది? సరే మన శక్తి ఏపాటిదో పరీక్షించుకొందాం అని, అనుకొని గది గోడలు బద్దలవ్వాలి అనుకొన్నా, కానీ ఏమి జరగలే.
ఓహ్! ఐతే నేనింకా మనిషినే!హతవిధీ లోకానికి ఎంత చక్కటి అవకాశం తప్పిపొయింది అని బాధ పడుతుండగా..
ప్ర
.: కానీ నువ్వు కోస్తుండగా చూసాము అని నలుగురు చెప్తున్నారు.
నేను
(మనసులో): నలుగురు రాజేంద్ర ప్రసాద్ సినిమాలో నలుగురా అనుకొని..ఆయన చూపించిన వైపుకు చూసా.
ఇంతకూ
ఆయన చూపించినది మా శ్రీకాంతి అండ్ కో ని..నాకు ఒక నిమిషం ఏమి అర్ధం కాలే
నేను
తేరుకొనేలొపు మా ప్ర. గారు తీర్పుని చదివి వినిపించేసారు
"
ఇతను ఏమి మాట్లాడకపోవడం అర్ధంగీకారంగా భావించి, పరిశీలించి, వీరి తరగతి అమ్మాయిలైతె అబద్దం చెప్పవచ్చు, కాని వేరే తరగతి వారు కూడా చూసినట్టూ సాక్ష్యం చెప్పడం, మరియు వారికి ఇతనికి ఏమి సంబంధం లేకపోవడం చేతా, ఇతనియందు ఆరోపించబడిన నేరం నిజం అని నమ్మి శిక్ష విధించే అధికారాన్ని సంగీత ఉపాధ్యాయురాలి మీద వదిలేస్తున్నాను" అని మరో మాట చెప్పకుండా పెదరాయుళ్ళా వెళ్ళిపోయారు. నేను జరిగిన పరిణామాలకు,అన్యాయానికి బుర్ర తిరిగి కొంచం అర్ధం అయ్యేటప్పటికి, అందరూ నా వైపే చూస్తున్నారు.మా గురివిణి గారి చూపు..మీకు తెలిసిందే కదా అలా ఉంది. ఇంక మా శ్రీకాంతి అండ్ కో మొహాల్లో ఏదో తెలియని ఆనందం.
నా మనసులో ఒక జపాన్ అగ్నిపర్వతం,బద్దలైపోయింది...ఖైదీలో చిరంజీవిలా గోడలు బద్దలుగొట్టుకొని పారిపోదాం అనుకొన్నా..కాని మా పక్కనున్న అడవిలో నిజంగానే అడివిజంతువులు ఉంటాయి అని తెలిసి ఆగిపోయా..
అప్పుడు మా గురివిణి గారు తీర్పు చెప్పారు:
నీకు శిక్ష ఏంటో తెలుసా..రోజుకు రెండు గంటలు మూడు నెలలపాటు సంగీత సాధన.అని చెప్పి నడిచి వెళ్ళిపోయారు.
జరిగింది నాకు అర్ధం అయ్యి నా బుర్ర పని చెయ్యటానికి సాయంత్రం వరకూ ఆగవలసి వచ్చింది. బుర్ర పనిచెయ్యడం మొదలు పెట్టాకా పలు రకాల ప్రశ్నలు..అవి ఏంటంటే..తరువాయి భాగం లో