Wednesday, November 3, 2010

పచ్చ వెల్లం - చూడ వెల్లం

                2006, ఆగస్టు 1st : నేను ఎం.టెక్ జాయిన్ ఐన రోజు. ఎక్కడ అనుకున్నారు, కాలికట్, కేరళ. నేను బి.టెక్ వరకు ఇంట్లో ఉండే చదువుకోవటం వళ్ళనో లేక బయటకి వెళ్ళి చదువుకోవటం ఇష్టం లేకనో నాకు తెలియదు కానీ, చాల బాధ పడ్డాను జాయిన్ అయ్యే టైం లో. మా అన్నని బాగా తిట్టుకున్నాను (చేర్పించింది ఆయనే కాబట్టి). మన ఊర్లో ఎండ, కాలికట్లో ఏమో భయంకరమైన వాన, అస్సలు పోలికుండేది కాదు. ఏదో కొత్త లోకంకి వెళ్ళి పడ్డట్టు అనిపించింది. హాస్టల్ కి  వెళ్ళి లగేజ్ పడేసి త్వరగా రెడి అయ్యి కాలేజి కి వెళ్ళాం మొదటిరోజు.
                సూపరుగ ఉంది కాలేజి. కేరళ కుట్టీలు అధిరారు. నా గుండె ఒకే రోజు అంత మందిని ఇష్టపడటం రోజు నుంచే మొదలైంది (పోయే కాలం మొదలైంది అని :) ). మా కాలేజీకి స్పెషలు ఉంది. పొద్దునంతా క్లాసు, మధ్యాహ్నం నుంచి ల్యాబు. సంవత్సరం అంతా అంతే. ఏముందిలే మధ్యాహ్నం త్వరగా జంపు ఐపోవచ్చు అనుకున్నాం మొదట్లో. మొదటిరోజు మధ్యాహ్నం ల్యాబు కెళ్తే తెలిసింది అసలు విషయం. అక్కడ ఐదు మందికి పది మందికి కలిపి ఒక బ్యాచ్చులా కాదు. ఒక్కొక్కడికి ఒక కిట్. అవుట్ పుట్ వస్తే కానీ వెళ్ళే దానికి లేదు. మొదటి ప్రోగ్రాం ఎల్..డి వెలిగించడం మైక్రో కంట్రోలర్ లో. ఎంత సేపు మాకు లైట్లు వెలుగుతున్నాయి కానీ, అక్కడ మాత్రం వెలగట్లేదు. మన బాషలో చుక్కలు కనపడ్డాయి అన్నమాట. ఇంక చేసేది ఏమి లేక మా ఆంధ్ర వాళ్ళంతా ఒకరి మొహాలు ఒకళ్ళం చూసుకుంటూ ఉండిపోయాం(అబ్బాలమే సుమీ). మా క్లాసు మొత్తం 18 మంది(అందులో ఐదు మంది ఎక్స్పిరిఎన్సుడు అంటే ఫ్రం ఇండస్ట్రీ అన్నమాట). అందులో ఐదు మంది ఫ్రం ఆంధ్ర (ఇందాక చెప్పినట్టు అందరం అబ్బాయిలమే :( ). నా పిచ్చి కాకపోతే మన ఊరు వదిలి అంత దూరం ఎందుకు వస్తారు అమ్మాయిలు. ఒకడు తమిలోడు. మిగతా వాళ్ళంతా మలయాళీలు. రెండో రోజు ల్యాబులో అందరు ఒక ఆయన దగ్గర గుంపు కట్టారు. ప్రోగ్రాం రాక మేము ఏడుస్తుంటే గ్రూప్ డిష్కషన్ ఏంట్రా అని వెళ్లి చూసాం. విషయమ ఏంటంటే అక్కడున్న ఆయనకి ఎల్..డి ప్రోగ్రాం వచ్చింది, అంతే మరో అరగంటలో మిగిలిన పదిహేడు మందికి వచ్చింది.(వండర్ కదా :D ) . ఇంక అంతే ప్రతి ప్రోగ్రాం ఆయనకొస్తే మాకు వచ్చినట్టే(ఎక్స్పిరిఎన్సా మజాకా అన్న సినిమా తీయాలనిపించింది నాకు అప్పుడు). మాకు అయన దేవుడు కంటే ఎక్కువగా కనిపించే వాడు అప్పట్లో. ఇప్పుడు ఖలేజ సినిమా అప్పుడు రిలీజు అయుంటే నేను ఆయనకు అల్లూరి సీతా రామ రాజు అని పేరు పెట్టుండే వాడినేమో :). 
               సీత కష్టాలు సీతవి - పీత కష్టాలు పీతవి అన్నట్టు కాకుండా కాలేజు కష్టాలు మాకే - కాలేజు బయట కష్టాలు కూడా మాకే అన్నట్టుండేది మాకు. బయట అన్నం మనం తినే ఉప్పుడు బియ్యం కన్న ఐదిన్తలు ఉంటుంది. మా ఇంట్లో ఉప్పుడు బియ్యంతో అన్నం చేస్తే నేను అస్సలు తినే వాడిని కాదు రోజు, ఇప్పుడో తప్పదు మరి. అప్పుడనిపించిది నాకు దేవుడున్నాడని. ఇంక సాంబార్, చెట్నీ, రసం చివరికి మజ్జిగ లో కూడా అప్పుడప్పుడు టెంకాయ నూనె ఉండేది. తిన్న కొత్తలో ఒక వారం రోజులు రెస్ట్ రూం ని వదల లేదు అంటే అర్ధం చేసుకోండి. అక్కడి ఫుడ్ కి అలవాటు పడటానికి ఒక నెల పట్టింది మాకు.మంచి నీళ్ళు ఇవ్వర బాబు అంటే చూడ వెల్లమా పచ్చ వెల్లమా అని అడిగేవాడు. పచ్చ బెల్లమేందిరా అనుకునే వాళ్ళం :) . తర్వాత అర్ధమైంది వాడు అడిగేది వేడి నీళ్ళా లేక చల్ల నీళ్ళా అని. అక్కడ ఏమి చెప్పక పోతే వేడి నీళ్ళలో అదేదో అవుషదమంట, అది వేసి తీసుకొచ్చి పెడతాడు. ఒక గ్లాసు లో మందు పోసుకొని వచ్చి పెట్టినట్టు ఉంటుంది కలరు. మొదట్లో బయపడ్దాం  ఏదైనా బార్ కి వచ్చామ అనుకొని. నీళ్ళని ఒక ఫోటో తీసి ఇంటికి పంపిస్తే చాలు నేను తాగుబోతు అయిపోయానని తప్పకుండ అనుకుంటారు మా ఇంట్లో(మా ఫ్రెండ్స్ ని మేము ఇలా బెదిరించే వాళ్ళం అప్పుడప్పుడు :) ). కానీ నీళ్ళు హేల్తుకి మంచిదని దాన్నే తాగే వాళ్ళం మేము. మొత్తానికి ఒక సంవత్సరం అంత అలాగే గడిపెసం. గుడ్ న్యూస్ ఏంటంటే నాన్ వెజ్ మాత్రం బాగానే చేస్తారు అక్కడ సో మాకు వారం లో రెండు మూడు రోజులు సండే అక్కడ :P.
               క్లాసులో మాకు మిడ్ పరీక్షలు ఉండేటివి ప్రతి సెమిస్టరుకి. మార్కులు చూడాలి నా సామిరంగా పదిన్నర, పదమూడు ముక్కాల్, పదనాలుగుoకాల్.. ఇలా వచ్చేవి ఇరవై ఐదుకి. 1/4 , 1/2 , 3/4 మార్కులు చూడటం అదే మొదటిసారి. హాఫ్ మార్క్ కి కూడా ఎంతో కష్టపడిన రోజులవి. 70% రావడానికి తల ప్రాణం అరికాళ్ళోకి వచ్చింది. మాకున్న ఒకే ఒక్క కాలక్షేపం మా కాలేజి పక్కన ఎన్.ఐ.టి. ఉండటం.. అందులో తెలుగోళ్ళు చదువుతుండటం మరియు మా కాలేజికి శనివారం కూడా హాలిడే అవ్వడం :). ఒక సంవత్సరం మొత్తం లో నేను ఇంటికి వెళ్ళింది రెండు లేక మూడు సార్లే :(. ఫస్ట్ టైం ఇల్లు విడిచి రావటం కదా చాల కష్టపడ్డాను నేనైతే. రూంలో ఉండటం మనకు కొత్త కదా, మా రూంమేట్ కి చాల ఓపిక, నన్ను భరించాడు. మొత్తానికి ఒక సంవత్సరం అక్కడ సినిమా కష్టాలు భరించి రెండో సంవత్సరం బెంగలూరుకి వచ్చా ప్రాజెక్ట్ ట్రైనీ గ :). ఇంక మళ్ళీ రాస్తాలే..సెలవ్